Home  »  Featured Articles  »  'నార‌ప్ప' మూవీ రివ్యూ

Updated : Jul 20, 2021

 

సినిమా పేరు: నార‌ప్ప‌
తారాగ‌ణం: వెంక‌టేశ్‌, ప్రియ‌మ‌ణి, రాజీవ్ క‌న‌కాల‌, రాఖీ, కార్తీక్ ర‌త్నం, రావు ర‌మేశ్‌ అమ్ము అభిరామి, నాజ‌ర్‌, వ‌శిష్ఠ సింహా, న‌రేన్‌, దీప‌క్‌శెట్టి, శ్రీ‌తేజ్‌, రామ‌రాజు, ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, కాదంబ‌రి కిర‌ణ్‌, ఝాన్సీ, బేబీ చైత్ర‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే: వెట్రిమార‌న్‌
సంభాష‌ణ‌లు: శ్రీ‌కాంత్ అడ్డాల‌
పాట‌లు: సీతారామ‌శాస్త్రి, అనంత శ్రీ‌రామ్‌
సంగీతం: మ‌ణిశ‌ర్మ‌
సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ కె. నాయుడు
ఎడిటింగ్‌: మార్తాండ్ కె. వెంక‌టేశ్‌
స్టంట్స్‌: పీట‌ర్ హెయిన్‌, విజ‌య్‌
ఆర్ట్‌: గాంధీ న‌డికుడిక‌ర్‌
కొరియోగ్ర‌ఫీ: వి.జె. శేఖ‌ర్‌
నిర్మాత‌లు: డి. సురేశ్‌బాబు, క‌లైపులి ఎస్‌. థాను
ద‌ర్శ‌క‌త్వం: శ్రీ‌కాంత్ అడ్డాల‌
బ్యాన‌ర్స్‌: సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, వి. క్రియేష‌న్స్‌
విడుద‌ల తేదీ: 20 జూలై 2021
ప్లాట్‌ఫామ్‌: అమెజాన్ ప్రైమ్ వీడియో (ఓటీటీ)

వెంక‌టేశ్ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కావ‌డం అనేది తెలుగు సినిమాకు సంబంధించినంత వ‌ర‌కూ ఓ పెద్ద వార్త‌. టాలీవుడ్‌లో ఒక బిగ్ స్టార్ న‌టించిన సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ్ కాకుండా స్ట్రయిట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ‌వ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్ కాబ‌ట్టి సినీగోయ‌ర్స్ అంతా ఈ సినిమా విష‌యంలో అత్యంత ఆస‌క్తిని చూపించారు. ధ‌నుష్ న‌టించ‌గా వెట్రిమార‌న్ డైరెక్ట్ చేసిన సూప‌ర్‌హిట్ త‌మిళ ఫిల్మ్ 'అసుర‌న్‌'కు ఇది రీమేక్‌. శ్రీ‌కాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన 'నార‌ప్ప' ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మ‌న‌కు అందుబాటులోకి వ‌చ్చేసింది. 

క‌థ‌
మూడెక‌రాల భూమిని న‌మ్ముకొని జీవ‌నం సాగించే నిమ్న జాతికి చెందిన‌ నార‌ప్ప (వెంక‌టేశ్‌)కు భార్య సుంద‌ర‌మ్మ (ప్రియ‌మ‌ణి), ఇద్ద‌రు కొడుకులు మునిక‌న్న (కార్తీక్ ర‌త్నం), సిన‌బ్బ (రాఖీ), ఒక కూతురు బుజ్జ‌మ్మ (చైత్ర‌) ఉంటారు. పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన బావ‌మ‌రిది బ‌స‌వ‌య్య (రాజీవ్ క‌న‌కాల‌) కూడా వారితో పాటే ఉంటాడు. ఆ ఏరియాలో భూస్వామి అయిన పండుస్వామి (న‌రేన్‌) త‌మ్ముడు దొర‌స్వామి (దీప‌క్‌శెట్టి) రంగూన్ నుంచి వ‌చ్చి అక్క‌డ‌ సిమెంట్ ఫ్యాక్ట‌రీ క‌ట్టాల‌నుకుంటాడు. అందులో భాగంగా మూడెక‌రాల నార‌ప్ప పొలాన్నీ సొంతం చేసుకోవాల‌నుకుంటారు. నార‌ప్ప ఇవ్వ‌డం కుద‌ర‌దంటాడు. రెండు కుటుంబాల మ‌ధ్య గొడ‌వ‌ల్లో మునిక‌న్న‌ను దారుణంగా హ‌త్య చేయిస్తాడు పండుస్వామి. ప్ర‌తీకారంగా పండుస్వామిని న‌రికి చంపుతాడు ప‌ద‌హారేళ్ల కుర్రాడైన సిన‌బ్బ‌. దాంతో చిన్న‌కొడుకునూ, త‌న కుటుంబాన్ని ర‌క్షించుకోడానికి అక్క‌డ్నుంచి పారిపోతాడు నార‌ప్ప‌. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? ఎన్ని గొడ‌వ‌లు జ‌రుగుతున్నా నార‌ప్ప సౌమ్యంగా ఎందుకుంటున్నాడు? దానికేద‌న్నా నేప‌థ్య‌ముందా? అనేది మిగ‌తా క‌థ‌.

విశ్లేష‌ణ‌
'అసుర‌న్' చూసిన‌వాళ్ల‌కు 'నార‌ప్ప'ను చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.. ఒరిజిన‌ల్‌కు ఈ రీమేక్ కార్బ‌న్ కాపీ అని. న‌టీన‌టుల‌ను మార్చి రెండు సినిమాల‌నూ ఏక కాలంలో చిత్రీక‌రించారేమోన‌నే అనుమాన‌మూ క‌లుగుతుంది. అసుర‌న్‌లో న‌టించిన న‌రేన్‌, అమ్ము అభిరామి ఈ సినిమాలోనూ అవే పాత్ర‌ల్లో క‌నిపిస్తారు కూడా. తెలుగు వెర్ష‌న్ కోసం స్క్రీన్‌ప్లేని ఏమాత్రం మార్చ‌కుండా య‌థాత‌థంగా వెట్రిమార‌న్ స్క్రీన్‌ప్లేతోటే 'నార‌ప్ప‌'ను తీశారు. త‌మిళంలోని డైలాగ్స్‌ను మాత్రం శ్రీ‌కాంత్ అడ్డాల తెలుగులోకి అనువ‌దించాడు. తిరుప‌తి చుట్టుప‌క్క‌ల గ్రామాల్లో జ‌రిగే క‌థ కాబ‌ట్టి డైలాగ్స్‌లో అక్క‌డి యాస‌ను వాడారు. దీనికి ప్ర‌ముఖ ర‌చ‌యిత నామిని సుబ్ర‌హ్మ‌ణ్యంనాయుడు స‌హ‌కారం తీసుకున్నారు. ఆ యాస‌లో న‌టులు మాట్టాడుతుంటే విన‌సొంపుగా ఉంది. కాక‌పోతే 'అసుర‌న్‌'లో ధ‌నుష్ ఏ స్టైల్‌లో డైలాగ్స్ చెప్పాడో, సేమ్ టు సేమ్ అదే స్టైల్‌లో వెంక‌టేశ్ డైలాగ్స్ చెప్తుంటే కాస్త త‌మాషాగా అనిపించింది. 

స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో డైరెక్ట‌ర్ ఎక్క‌డా స్వేచ్ఛ తీసుకోకుండా త‌మిళ ఒరిజిన‌ల్‌ను మ‌క్కీకి మ‌క్కీ దింపేయ‌డం కూడా అంత బాగ‌నిపించ‌లేదు. 'అసుర‌న్‌'లో ధ‌నుష్ త‌న కొడుకును తీసుకొని లాయ‌ర్ ప్ర‌కాశ్‌రాజ్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు ప్ర‌కాశ్‌రాజ్ నెరిసిన గ‌డ్డంతో క‌నిపిస్తాడు. 'నార‌ప్ప‌'లో అదే సీన్‌లో లాయ‌ర్ రావు ర‌మేశ్ కూడా నెరిసిన గ‌డ్డంతోనే క‌నిపిస్తాడంటే, శ్రీ‌కాంత్ అడ్డాల ఒరిజిన‌ల్‌ను ఎంత‌గా ఫాలో అయ్యాడో ఊహించుకోవ‌చ్చు. ఆఖ‌రుకు కాస్ట్యూమ్స్ విష‌యంలోనూ అంతే. ఒరిజిన‌ల్‌లో ఏ క్యారెక్ట‌ర్ ఏ త‌ర‌హా డ్ర‌స్సుల్లో క‌నిపిస్తాయో 'నార‌ప్ప‌'లోని అన్ని క్యారెక్ట‌ర్లు అవే త‌ర‌హా దుస్తుల్లో క‌నిపిస్తాయి. కేవ‌లం న‌టీన‌టులు మారారంతే. లొకేష‌న్లు కూడా ఒరిజిన‌ల్‌లో ఉన్న‌ట్లే క‌నిపిస్తాయి.

'అసుర‌న్' ప్ర‌స్తావ‌న‌ను కాసేపు ప‌క్క‌న‌పెడితే, పండుస్వామిని న‌రికి చంపిన సిన‌బ్బ‌ను తీసుకొని నార‌ప్ప ఒక దిక్కు, చెల్లెలు సుంద‌ర‌మ్మ‌, మేన‌కోడ‌లు బుజ్జ‌మ్మ‌ను తీసుకొని బ‌స‌వ‌య్య ఇంకో దిక్కు పోతే, వాళ్ల‌ను ప‌ట్టుకోడానికి దొర‌స్వామి మ‌నుషులు వేట మొద‌లుపెట్ట‌డంతో సినిమా మొద‌ల‌వుతుంది. ఈ స‌న్నివేశాల‌తోటే ప్రేక్ష‌కుడు క‌థ‌లో లీన‌మైపోతాడు. అంత‌లో వాళ్లెందుకు అలా పారిపోతున్నారో చెప్ప‌డం ప్రారంభిస్తాడు క‌థ‌కుడు. గొడ‌వ‌ల్లో ఆవేశం ప్ర‌ద‌ర్శించ‌కుండా నార‌ప్ప సౌమ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం, కొడుకులు మునిక‌న్న‌, సిన‌బ్బ ప్ర‌తిదానికీ ఆవేశ‌ప‌డుతుండ‌టం చూస్తాం. ఆఖ‌రుకు సుంద‌ర‌మ్మ‌కున్న ఆవేశం కూడా నార‌ప్ప‌లో క‌నిపించ‌దు. త‌మ పొలంలోని బావిలోంచి పండుస్వామి మ‌నుషులు నీళ్ల‌ను తోడేస్తుంటే.. అడ్డుకోబోతుంది సుంద‌ర‌మ్మ‌. కర్ర‌కు గుచ్చిన కొడ‌వ‌లితో ఒక‌డి పీక కూడా ప‌ట్టేసుకుంటుంది. ఆమెలోని వీర‌త్వాన్ని మెచ్చుకోకుండా ఉండ‌లేం.

త‌న కొడుకు రంగ‌బాబుపై మునిక‌న్న చేయిచేసుకున్నందుకు నార‌ప్ప‌ను త‌న‌తో స‌హా ఊళ్లోని త‌మ‌వాళ్లంద‌రి ఇళ్ల‌కూవెళ్లి అక్క‌డి మ‌గాళ్ల కాళ్ల‌కు దండం పెట్టిస్తాడు పండుస్వామి. వెంక‌టేశ్ అలా చిన్న పెద్దా మ‌గాళ్ల కాళ్ల‌కు సాష్టాంగ న‌మ‌స్కారాలు చేస్తుంటే మ‌న‌కు ఆ పాత్ర‌పై సానుభూతి క‌లుగుతుంది. తండ్రిచేత అలాంటి ప‌ని చేయించిన పండుస్వామిని సినిమా హాలు మ‌రుగుదొడ్డి ద‌గ్గ‌ర మునిక‌న్న చెప్పుతో కొట్టి అవ‌మానిస్తే అత‌డి హీరోయిజానికి శ‌భాష్ అంటాం. అదే మునిక‌న్న‌ను పండుస్వామి దారుణంగా హ్య‌త‌చేయించి త‌ల న‌రికేసి, మొండేన్ని ఒక ఖాళీ పొలంలో ప‌డేయిస్తే, నార‌ప్ప‌-సుంద‌ర‌మ్మ‌లు అక్క‌డ‌కు వ‌చ్చి, ఆ మొండేన్ని చూసి విల‌పించే స‌న్నివేశాల‌కు మ‌న హృద‌యం ద్ర‌వించిపోతుంది. తండ్రి ఏడ‌వ‌డం, తాగ‌డం త‌ప్ప ఏమీ చేయ‌ట్లేద‌ని కోపంతో ఊగిపోతూ, త‌నే సొంతంగా త‌యారు చేసిన బాంబులను సంచీలో వేసుకొని, పండుస్వామిని ప‌ద‌హారేళ్ల పిల్ల‌గాడు సిన‌బ్బ క‌త్తితో మెడ‌న‌రికితే, అలా చెయ్యాల్సిందేన‌ని సిన‌బ్బ ఆవేశంతో స‌హానుభూతి చెందుతాం.

ఇక పండుస్వామి మ‌నిషి గంప‌న్న (బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌) త‌న అనుచ‌రుల‌తో సిన‌బ్బ‌ను ప‌ట్టి చంప‌బోతుంటే, అంత‌దాకా సౌమ్యంగా క‌నిపించిన నార‌ప్ప అతివీర భ‌యంక‌రుడిలా మారి, అంద‌ర్నీ చిత‌క్కొట్టి కొడుకును ర‌క్షించుకోవ‌డం చూసి ఇప్ప‌టిదాకా నార‌ప్ప‌లోని ఈ వీర‌త్వం, ఈ ఆవేశం ఏమైపోయింద‌ని అనుకుంటాం. తండ్రి ప‌రాక్ర‌మాన్ని క‌ళ్లారాచూసి నోరెళ్ల‌బెట్టిన సిన‌బ్బ‌కు అప్పుడు నార‌ప్ప త‌న క‌థ చెప్తాడు. ఆ క‌థ మ‌న‌ల్ని మ‌రింత‌బాగా ఆక‌ట్టుకుంటుంది. నిమ్న కులాల‌పై భూస్వామ్య వ‌ర్గాల‌వారు చేసే దాష్టీకాలు ఎలా ఉంటాయో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో. అయితే నార‌ప్ప మేన‌కోడ‌లుగా ఒరిజిన‌ల్‌లో న‌టించిన అమ్ము అభిరామినే తీసుకోవ‌డం క‌రెక్ట‌నిపించ‌లేదు. ధ‌నుష్ ప‌క్క‌న అమ్ము అభిరామి స‌రిపోయింది కానీ, వెంక‌టేశ్ ప‌క్క‌న ఆమెను ఊహించుకోవ‌డం ఇబ్బందిక‌రం. ఆరు ప‌దులు దాటిన వెంక‌టేశ్‌కు ఎంత మేక‌ప్ వేసి కుర్రాడిగా మార్చినా, 20 ఏళ్ల అభిరామి ప‌క్క‌న ఆయ‌న ఏమాత్రం న‌ప్ప‌లేదు. ఇదొక్క‌టి మిస్‌క్యాస్టింగ్ అనిపించింది. అయితే ఆమె పాత్ర‌, ఆమెపై చిత్రీక‌రించిన స‌న్నివేశాలు హృద‌యాల‌ను పిండేస్తాయి. చెప్పులు వేసుకున్న‌ద‌ని ఆ చెప్పుల్నే ఆమె త‌ల‌పై పెట్టించి, వీధుల్లో న‌డిపిస్తూ ఆమెను కాలితో తంతూ శీనా చేసే దాష్టీకం స‌న్నివేశాలు నిమ్న కులాల వారిపై అగ్ర‌వ‌ర్ణాల దుర‌హంకారం ఎలా ఉంటుందో క‌ళ్ల‌కు క‌ట్టిస్తాయి.

టెక్నిక‌ల్‌గానూ సినిమా ఉన్న‌త ప్ర‌మాణాల‌తో క‌నిపించింది. మ‌ణిశ‌ర్మ సంగీతం, శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు ఎస్సెట్‌గా నిలుస్తాయి. గాంధీ న‌డికుడిక‌ర్ ఆర్ట్ వ‌ర్క్ కానీ, పీట‌ర్ హెయిన్‌, విజ‌య్ స్టంట్స్ కానీ టాప్ స్టాండ‌ర్డ్స్‌లో ఉన్నాయి. మార్తాండ్ కె. వెంక‌టేశ్ ఎడిటింగ్ కూడా ఈ 155 నిమిషాల నిడివి సినిమాను ఇంప్రెసివ్‌గా మార్చింది.

న‌టీన‌టుల అభిన‌యం
'నార‌ప్ప' అనేది క‌థ‌తో పాటు తార‌ల అభిన‌యం మీద ఆధార‌ప‌డిన సినిమా. టైటిల్ రోల్‌లో వెంక‌టేశ్ న‌ట‌న గురించి చెప్పేదేముంది! ఎప్ప‌టిలా అత్యుత్త‌మ స్థాయి అభిన‌యాన్ని చూపారు. వృద్ధాప్య చాయ‌లు మీద‌ప‌డుతున్న వాడిలా, ఫ్లాష్‌బ్యాక్‌లో యువ‌కుడిలా రెండు ఛాయ‌ల పాత్ర‌ను సూప‌ర్బ్‌గా పోషించారు. సుంద‌ర‌మ్మ పాత్ర‌లో ప్రియ‌మ‌ణి రాణించింది. చాలా కాలం త‌ర్వాత ఆమెను స్క్రీన్‌ప్లే ఇలాంటి అభిన‌యానికి అవ‌కాశం ఉన్న పాత్ర‌లో చూడ‌డం ఆనందం క‌లిగించింది. రాజీవ్ క‌న‌కాల‌కు కూడా ఎంతో కాలం త‌ర్వాత ఒక మంచి పాత్ర ల‌భించింది. బ‌స‌వ‌య్య పాత్ర‌లో ఇమిడిపోయాడు. ఒరిజిన‌ల్‌లో ప‌శుప‌తికి ఏమాత్రం త‌గ్గ‌లేదు స‌రిక‌దా, ఇంకా బెట‌ర్‌గా చేశాడ‌నిపించాడు. 

లాయ‌ర్‌గా రావు ర‌మేశ్ త‌న‌కు అల‌వాటైన రీతిలో సునాయాసంగా ఆ పాత్ర‌ను చేసుకుపోయాడు. పండుస్వామిగా న‌రేన్‌, దొర‌స్వామిగా దీప‌క్‌శెట్టి, ఇన్‌స్పెక్ట‌ర్ తిప్పేస్వామిగా రామ‌రాజు ఆ పాత్ర‌ల‌కు న్యాయం చేకూర్చారు. ఫ్లాష్‌బ్యాక్ స్టోరీలో వ‌చ్చే శంక‌ర‌య్య‌గా నాజ‌ర్‌, శీనాగా వ‌శిష్ఠ సింహా, క‌న్న‌మ్మ‌గా అమ్ము అభిరామి పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. ప్ర‌త్యేకంగా మెన్ష‌న్ చేయాల్సింది మునిక‌న్న‌గా కార్తీక్ ర‌త్నం, సిన‌బ్బ‌గా కొత్త న‌టుడు రాఖీ న‌ట‌న‌ను. ఇద్ద‌రూ త‌మ పాత్ర‌ల‌ను పోషించిన తీరు ముచ్చ‌టేస్తుంది. మ‌రీ ముఖ్యంగా రాఖీ న‌ట‌న చూస్తే.. అత‌డికి మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌నిపించింది.

తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌
పూర్తిగా 'అసుర‌న్' త‌ర‌హాలోనే న‌డిచే 'నార‌ప్ప' ఆక‌ట్టుకుంటాడు. ఊళ్ల‌లోని నిమ్న కులాల వారిపై అగ్ర కులాలు జ‌రిపే దౌర్జ‌న్యాల‌ను అత్యంత ప్ర‌భావవంతంగా చూపించే 'నార‌ప్ప‌'లోని న‌టీన‌టుల‌ అభిన‌యాలు ఆక‌ట్టుకుంటాయి. ఇప్ప‌టికే 'అసుర‌న్' చూసిన‌వాళ్ల‌కు పెద్ద‌గా ఏమీ అనిపించ‌క‌పోవ‌చ్చు కానీ, ఆ సినిమాని చూడ‌నివాళ్ల‌కు 'నార‌ప్ప' త‌ప్ప‌కుండా న‌చ్చుతాడు.

రేటింగ్‌: 3/5

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.